మట్టికుండలాంటి మానవజన్మలో మనిషికి దైవత్వాన్ని చూపించేవి రెండే రెండు నా ఉద్దేశంలో - జీవన్ముక్తులైన మహామహుల విషయం కాదు, నా లాంటి మామూలు మనుషుల విషయంలో - ఒకటి ఇంకా ప్రపంచం తెలియని పసి పిల్లలు .. అందుకే మహానుభావులు దేవులపల్లి రాశారు, పిల్లలూ దేవుడూ చల్లని వారే అని.
రెండోది సంగీతం. అందునా కర్నాటక సంగీతం.
మన పూర్వులు మనకిచ్చి పోయిన అపారమైన సాంస్కృతిక వారసత్వ సంపదలో అతిగొప్ప రత్నం కర్నాటక సంగీతం. అట్లాంటిదే ఇంకో గొప్ప రత్నం మన సాంప్రదాయ కవిత్వం. తెలుగువారమై పుట్టి ఈ రెండు రత్నాలనీ రెండు కళ్ళకీ అద్దుకుని ఆస్వాదించలేకపోతే .. ప్చ్!
సంగీతం వినడం నేర్పినందుకు మా అమ్మకి ప్రతిరోజూ మొక్కుతుంటాను.
సాధారణంగా నాస్టాల్జియాకి లోనుకాను కానీ సంగీతం వినడం విషయంలో నాకు పాతరోజులే బావుండేవి. ఇంట్లో ఒక మంచి స్టీరియో ఉండేది. ఆఫీసులో ఒక వాక్మేన్ ఉండేది. నా సంగీతం అంతా కేసెట్లు, సీడీల్లోనే ఉండేది. ఇంట్లో ఉన్నంత సేపూ స్టీరియో మోగుతూనే ఉండేది. ఆఫీసులో డెస్కు దగ్గర ఉన్నంత సేపూ కేసెట్ మార్చి కేసెట్ మోగుతూనే ఉండేది. ఫలితంగా మనసు సంతతమూ స్వరానందహేలలో ఊయలూగుతూ ఉండేది. మేలుకుని ఉన్న సమయంలో 50 శాతానికి మించిన సమయం సంగీతం వింటూ ఉండేవాణ్ణి అంటే అతిశయోక్తి కాదు.
అట్లాంటిది కొన్నేళ్ళుగా జీవితంలో విపరీతమైన సంగీత లేమి ఏర్పడింది. సంగీతం వినిపించే వస్తువులు, వినే పద్ధతులు తామర తంపరగా, ఎటు తల తిప్పితే అటు ప్రత్యక్షమయ్యే ఈ రోజుల్లో ఇలాంటి లేమి విచిత్రమే గాక మనసుని కుంగదీసేదిగా తయారైంది. నాకెందుకనో నెట్లో సంగీతం వినడం అచ్చిరాలేదు. MP3 ప్లేయర్లు, సెల్ఫోనులో ప్లేయర్లు కూడా తలకాయనొప్పినే తెచ్చి పెట్టాయి.
ఇహ ఇది పద్ధతి కాదని ఒక ప్రాజెక్టుగా పెట్టుకుని ఉన్న కర్నాటక సంగీతం సీడీలన్నీ అంకోపరిలోకి ఎక్కించాను ముందు. అటుపైన ఒకటి రెండు చిన్న సీడీ వాలెట్లు కొని కార్లో పెట్టుకుని కారెక్కినప్పుడల్లా కచ్చితంగా వింటున్నాను. అలా పూర్వవైభవంతో కాకపోయినా కొద్దిస్థాయిలోనైనా మళ్ళీ సంగీతం నా జీవితంలోకి ప్రవహిస్తూన్నది ప్రస్తుతం.
ఇంతకీ ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే, ఇవ్వాళ్ళ ఒక కస్టమరు మీటింగ్ నించి తిరిగి వస్తున్నాను. మీటింగ్ చాలా చీకాకు పెట్టింది, మనసు చిరాగ్గా ఉంది. అలవాటు చొప్పున రోడ్డెక్కగానే కార్ స్టీరియో ఆన్ చేశాను.
ఆలత్తూర్ సోదరుల (కీ.శే. శివసుబ్రహ్మణ్య అయ్యరు, శ్రీనివాస అయ్యరు గారలు) గాత్రం నడుస్తున్నది. మాయామాళవగౌళ రాగంలో విదులకుమ్రొక్కెద అని త్యాగరాజస్వామి కృతి. ఓరి నా దేవుడా! ఏమి ఆ మాధుర్యం!! కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఈ సీడీలో ఇంకా రామా నీపై (కేదారం), కాంతా తవ (అఠాణా), చేరరావదేమిరా (రీతిగౌళ), బేహాగ్ తిల్లానా, విశ్వేశ్వర (సింధుభైరవి) ఉన్నాయి. అన్నీ అన్నే. గమ్యం చేరేలోపల మనసు తడిసి ముద్దయింది.
ఇక్కడో మాట చెప్పాలి. ఇప్పుడు సంగీత సామ్రాజ్యాన్ని ఏలుతున్న సుధ రఘునాథన్, ఉన్నిక్రిష్ణన్, సంజయ్ సుబ్రహ్మణ్యం ఇత్యాదుల గాత్రాన్నీ బాగానే అభిమానించాను ఇన్నాళ్ళూ. కానీ ఈమధ్య మళ్ళీ వినడం మొదలు పెట్టినప్పటినించీ పాతతరం వారి గాత్రంతో పోలిస్తే వీళ్ళ గొంతుల్లో ఏదో .. ఇదీ అని చెప్పలేని ఒక లోటు. సంజయ్ సుమారు నలభై నిమిషాలపాటు బాగా విపులంగా పాడిన మాయామాళవగౌళ ఉన్నది నా దగ్గర. కానీ ఆలత్తూర్ సోదరులు పది పన్నెండు నిమిషాల్లో గుప్పించిన మాధుర్యం ఏదీ సంజయ్ గాత్రంలో? అటుతరంలోనూ ఇటుతరంలోనూ ఎవరో ఒకరిద్దరు గాయకుల గురించి కాదు, అసలు మొత్తానికి, ఆ తరం నించి ఈ తరానికి సంగీతంలో అంతర్గతంగా ఉన్న సహజలక్షణంలో ఏదో తెలీని మార్పు వచ్చింది. బహుశా గాయకుల తరాల మార్పో, శ్రోతల తరాల మార్పో, musical taste లో మార్పో - తెలీదు. ఓలేటి, సెమ్మంగూడి, ఎం డి రామనాథన్, నేదునూరి ఇత్యాదులు నచ్చినట్టు ఇప్పటివారు నచ్చటంలేదు. నచ్చకపోవడం కూడా కాదు - వీళ్ళనీ వింటూ ఆస్వాదిస్తూనే ఉన్నా రికార్డుల్లోనూ ప్రత్యక్ష కచేరీల్లోనూ. కానీ వీళ్ళ సంగీతం ఆ స్థాయి ఎక్కిరావట్లేదు అనిపిస్తోంది.
పాతతరంవారు ఎక్కువగా రికార్డు చెయ్యలేదు. కానీ ఈ మాత్రమైనా మిగిలి మనదాకా వచ్చినందుకు సంతోషిస్తున్నా.
అదండీ సంగతి. తీగలాగితే డొంకంతా కదిలింది.